By Shailaja Mamidala
ఓ మనిషీ..
కృత్రిమ మేధను సృష్టించి
తెలివి, ప్రతిభ అని విర్రవీగుతున్నావు
భవిష్యత్తు నియంత్రణలో పెట్టుకున్నానని గర్విస్తున్నావు!
హాని చేసే పరిణామాలను సృష్టించుకుని
నీ ఘనత అని సంబరపడుతున్నావు!
కానీ మనిషికి సరిసాటి ఏదీ లేదు
తెలివి, ఆలోచన శక్తి మాత్రమే కాదు!
ప్రేమ, అనుభూతులు, అనుబంధాలు
అవి మనిషికి మాత్రమే సొంతం!
మనిషి హృదయంలో మానవీయత ఉంది స్పర్శలో వెచ్చదనం ఉంది
కన్నీటిలో భావోద్వేగం ఉంది
దాన్ని ఏ యంత్రం పునఃసృష్టించగలదు?
కృత్రిమ మేధ జీవితంలో బుద్ధికి
భావాలకు ప్రత్యామ్నాయమవుతుందా?
యాంత్రికత పెరిగిన కొద్దీ
మానవీయత మాయమైపోతున్నది
మనిషికి, యంత్రానికి మధ్య
కృత్రిమమేధ గీతలు చెరిపేయనుందా?
ప్రేమ, ద్వేషం, బాధ, ఆనందాలను
అది గణించగలదా?
ప్రేమ అంటే లెక్కల లోకం కాదు.
భావోద్వేగాలకు సంకేతాలు లేవు!
మనిషి మనసుకు స్వాంతననిచ్చేది
ఓ హృదయం మాత్రమే, యంత్రం కాదు!
తల్లి ఒడి వెచ్చదనం ఒక తీయని జ్ఞాపకం మాత్రమే అవుతుందా?
స్నేహం గణిత సమీకరణo కాదు
నమ్మకం ప్రోగ్రామింగ్ కోడ్ అవదు!
నిజమైన అనుభూతులను
సిలికాన్ వృక్షాల నీడలో వెతుకుతున్నాం
కానీ అవి ఎప్పటికీ వికసించవు!
నిజమైన మానవీయతకు ప్రతిరూపం కావు! మనిషి భావోద్వేగాలను
యంత్రం భర్తీ చేయలేదు ఎప్పటికీ!
అది సమయానుకూలంగా స్పందించగలదా? నిజమైన సహానుభూతిని అందించగలదా?
కష్టాల్లో, ఒంటరితనంలో అండగా ఉంటాయా ప్రకృతిసిద్ధంగా భరోసా ఇస్తాయా?
క్షణక్షణం మారుతున్న లోకంలో
దయ, ప్రేమ, మానవత్వం అనే వృక్షం స్థానంలో, సిలికాన్ పుష్పమే విరబూస్తుందా..
మెకానికల్ ప్రపంచమే మిగులుతుందా?
మనిషిగా అనుభూతులను మరిచిపోయిన రోజున భవిష్యత్ ప్రయాణం ఎటు వైపు?
నీ గుండె లయతో నడిచే ప్రేమను
ఏ యంత్రం పునఃసృష్టి చేయలేదు..
ఇకనైనా నిన్ను నువ్వు మరిచిపోక
ముందే నీ మనిషితనాన్ని నిలుపుకో!