తొలకరి చినుకులు – Delhi Poetry Slam

తొలకరి చినుకులు

By Narendra Singuru 

నీకై నిరీక్షణ లో 
తడి ఆరిన కనురెప్పలు 
విప్పినపుస్తకంలో 
జ్ఞాపకాల పుటల కోసం వెతుకుతున్నాయి.

గాయపడ్డ గుండెకు, 
గాజుగుడ్డ చుట్టాను రక్తం స్రవించకుండా.
నీలా, నవ్వు నిశ్శబ్దంగా నిష్క్రమించింది.

అలసిన కనులపై ఓదార్పుగా
చిరుగాలి స్పృశించింది.

వెన్నెల కింద కూర్చుని,
ఇప్పుడు నక్షత్రం కోసం వెతుకుతున్నా
ఇంకా జాడ లేదు

శిధిలమౌతున్న కంటిచూరు కింద
రంగు వెలిసిన కలలు, 
నిద్రను మింగేసిన రాత్రులతో,
జతకూడి నవ్వుతున్నాయి.

ఇప్పుడు స్వప్నాలు భయపడుతున్నాయి
కనురెప్పల చివర  నెత్తుటి  చారికలు చూసి.

ఆశల ముసురు పట్టిన మేఘం
ఒడిదుడుకుల అవరోధంతో వర్షించి
పచ్చని ఆకు మేనుపై
తొలకరి చినుకై కురిసి తళుక్కున మెరిసింది.

గొంతెండిన నేల దుఃఖం,
రాలిపడ్డ చినుకుతో ఊపిరి పోసుకుంది.
శ్వాస కు మట్టి వాసన విత్తునిచ్చింది.

నదిలోకి ఒలికిన నీటి బొట్టు కోసం
ఇంకా మేఘం వెతుకుతునే ఉంది. 


Leave a comment