By Lakshmi Kameswar
తరాల తరబడి మేం ఒకే నేలపై స్థిరంగా నిలబడి ఉన్నాం.
కేవలం నాలుగయిదు చదరపు అడుగుల కోసం తనూ
ఆరడుగులయినా చాలని నేనూ,
బెరడునే కవచంగా తనూ
కరడుగట్టిన హృదయం మోస్తూ నేనూ,
పత్రహరితానికై తాపత్రయపడుతూ తనూ
యెడతెగని మాటలాడుతూ నేనూ,
ఒంటరిసైన్యంలా ప్రాణవాయువు సిధ్ధం చేస్తూ తనూ
జానెడు పొట్టచేతపట్టుకుని నేనూ,
నేనూ నా మానవాళి అని తనూ
నేనూ నావాళ్ళూ అని నేనూ,
మౌనం విరజిమ్ముతూ తనూ
రోజూవారీ పనులతో యుధ్ధంచేస్తూ నేనూ,
తరువనే పేరుతో తనూ
బతుకుతెరువనే పేరుతో నేనూ,
ఎన్నటికయినా ఒకే మన్నులో
కలవాలని కలలు కంటూనే ఉన్నాం
వేరువేరుగా మేమిద్దరం.