By Krishna Chaitanya Banala

పొగగొట్టపు పట్టణంలొ, పొట్ట చేత పట్టుకొని
తిరిగాము తిరిగాము, ఎన్నెన్నో వీధులు
నడిచాము నడిచాము ఏవేవో దారులు
అగ్గిపెట్ట మేడలలొ, జీవలేమి గదులలోన
గడుపుతూ ఉన్నాము ఈ యవ్వన కాలాన్ని
వెతుకుతూ ఉన్నాము ఈ జీవన సారాన్ని
అమ్మ చేతి వంటల్ని, నాన్న గోరు ముద్దల్ని
నెమరువేసి నెమరువేసి, విసిగెను ఈ ప్రాణం
గురుతుచేసి గురుతుచేసి గడిచెను మా కాలం
నవ్వులేని మోములతొ, యాంత్రిక ఈ జీవితములొ
భవిష్యత్తు పరపతికై
ఇస్తున్నాం ఈ క్షణాన్ని
పోస్తున్నాం మా జవాన్ని
ఎందుకు ఈ పోరాటం, దేనికి ఈ ఆరాటం
ఎంత చేసినా కాని ఒక్క ముద్దకే కదా
ఎంత వేగినా కాని నిద్ర తథ్యమే కదా
సొంత ఊరు వదిలేసి, ఇంట నీడ కాదనేసి
కలలు కన్న రాజ్యాన్ని, ఏనాటికి కట్టేమో
ఆశపడ్డ జీవితాన్ని ఎప్పటికి చుసేమో
ప్రపంచం ఒ మంచె అని, జీవితమొక
నాటకమని, తెలుసుకున్నా కాని
ఆడటము పాడటము ఆపలేకపోతున్నాం
వ్యసనాలను, విదివ్యధలను వీడలేకపొతున్నాం
దూరదర్శినీలొ, చరవాణి కబుర్లలొ
పరివారపు ప్రేమలను పంచుకుంటు, తెంచుకుంటు
కలవారపు ఆశలను ఎంచుకుంటు సాగినాము
ఈ మత్తులొ, గమ్మత్తులొ
ఈది, ఎగిరి, పడి, లేచి
దాటుతున్న ఈ వంతెన
నా గమ్యము చేర్చేనో, అగమ్యముగ మార్చేనో ?