By Chowdam Venkata Malyadri

ఎన్ని పల్లెల విషాద మహాప్రస్థానమో..,
క్రిక్కిరిసిన నక్షత్రాలతో
ఆకాశం అట్టుడుకుతోంది-!
బతుకు రాదారులనుండి నెట్టబడ్డ
నిర్మలమైన పల్లె అక్షయ పాత్రలో
ఏరువాకల నిత్య శిక్షణాక్షేత్రంలో
పువ్వులే కాదు -,
కట్టెలూ దొరకని ఎడారి ఏకాకితనం -!
ఓడలే కాదు -,
బండ్లు కూడా లేని బహుదా బికారితనం -!!
మెట్ట ప్రాంత జీవన భాండాగారంలో
తిష్టవేసిన గడ్డుస్థితుల బంధిపోటు
సారవంతమైన అధికారాన్ని కొల్లగొట్టి
సంక్షోభంతో క్షామాన నెట్టేస్తుంటే..,
సాయంకోసం నెర్రెలనోరు తెరుస్తూ
చిరిగిన చింకిపాతల్లా
యిక్కడి పంటపొలాలు -!
బలీయమైన సాగుబడి పీఠమ్మీద
కాలుష్యం అలిమిన
ఎండుటాకుల చరమస్వరాల్లో
పసిడిగింజల పొద్దుపొడుపులు అస్తమించాక..,
నిండుకున్న ప్రకృతి సూక్తి పాఠంకై
యోగ్యత కోల్పోయిన ఇంటింటి యోగుల్లా
పచ్చదనాన్ని తపిస్తున్నవి
యిక్కడి బీడుభూములు -!
స్వభావ సౌభాగ్యం ఆవిరైపోయి
అన్నిశాఖల్లో అలసత్వం మిన్నుముట్టి
సకాలంలో చినుకుసారం జారవిడిచేందుకు
మొరాయిస్తున్న అంతటి మేఘాలూ..,
అదునులో ఆకాశానికి ఉరిపోసుకుంటుంటే
కంఠాన ఒంపుకునేందుకు కన్నీరైనా మిగలక
ఎండుకు చస్తున్నవి -,
యిక్కడి బావులు చెరువులు -!
కొంగముక్కు బోర్లతో క్రిందికంటా వెళ్లి
పాతాళానికి ఎంతగా మొరపెట్టుకున్నా
ఆశ తీర్చని ఆశనిపాతం
కబంద శిశిరాలలోని ముళ్లతుప్పలకు ముడేశాక
తడి చిత్తడి చుట్టరికం చెల్లిపోయి..,
ఆకుపచ్చని సౌభాగ్యం ఆవిరైపోయి..,
ముండరికాన్ని మోస్తున్నవి
యిక్కడి చెట్లు చేమలు -!
పట్టుతప్పిన ప్రకృతి కొలువులో
కట్టు తెంచుకున్న కరువు వీరంగం
అతివృష్టి అనావృష్టులను తలకెత్తుతూ
మూకుమ్మడి స్మశానాలను విస్తరిస్తుంటే..,
కకావికలై కొల్లబోతూ
వసంతపు ఆసరాలేక -, దిక్కులేని
దిష్టిబొమ్మల్లా -,యిక్కడి మట్టిమనుషులు -!
జీవంలేని జీర్ణ దేవాలయాల్లా
యిక్కడి పాడుబడ్డ పల్లెలు -!!