అక్షరాలే నాసర్వస్వం – Delhi Poetry Slam

అక్షరాలే నాసర్వస్వం

By Chandrakala Yalamarty

నేను అక్షరాల తోటలో విహరిస్తుంటాను
 ప్రతిరోజూ తాజాగా విరబూసే అక్షరాలను పోగు చేసుకుని
 కవితల మాలలల్లి అష్టోత్తరాలు,సహస్రనామాలుగా వాగ్దేవికి సమర్పిస్తుంటాను
 అక్షరాల వెంటే నా కళ్ళు పరుగులు పెడుతుంటాయి
 అక్షరాల్ని కలుపుతూ విడదీస్తూ కొత్తపదాలకు జీవం పోస్తాను
 కొన్ని అక్షరాలు ఉడికించి కడుపార ఆరగిస్తుంటాను
 కొన్ని అక్షరాలను కాచి వడపోస్తుంటాను మరికొన్ని అక్షరాలతో ఆడుకుంటాను
 అక్షరాలకు మెరుగులు దిద్ది సొగసును తెస్తుంటాను
 అజంతా, ఎల్లోరా హొయలు నా అక్షరాల్లో దాగున్నాయి
 కొన్ని అక్షరాలతో చరణాలు కట్టి పాడాలని ప్రయత్నిస్తా
 కొన్ని అక్షరాల ఉచ్ఛారణకు లయగా నాపాదాలు నాట్యంచేస్తాయి
 తెలుగు తల్లికి అక్షరాల కథల చీరనేసి అనందంగా సమర్పించుకుంటా
 అక్షరాలన్నీ ఏకమై ఒకేసారి ఉప్పెనలా పొంగితే అది నా కవితగా రూపుదిద్దుకుంటుంది
 అక్షరాల వినీలాకాశంలో మిణుకుమనే తారల నడుమ వెలిగిపోవాలని ఆశ పడుతుంటా 
 
 అక్షరాలు అయస్కాంతాలై నన్ను ఆకర్షిస్తుంటాయి
 అక్షరాల సాంగత్యంలో నన్ను నేనుమరచిపోతుంటా
 అక్షరమే అందలమెక్కిస్తుంది. అక్షరాలతో అందనిశిఖరాలు చేరాలని ఆశపడుతుంటాను
 అక్షరాలే నన్ను అజ్ఞానఅగాధంలోకి జారకుండా కాపాడుతాయి
 
 అక్షరాలు మాటలై, మాటలు మంత్రాలై నన్ను శాసిస్తాయి
 ఆ పవిత్ర బీజాక్షరాలకు నేను మంత్రముగ్ధ నౌతా
 ఒకో అక్షర శరాఘాతానికి నేను గాయపడుతుంటాను
 మరో అక్షరం లేపనమై నాకు ఉపశమనమిస్తుంది...
 అక్షరమే నా ప్రాణనేస్తమై అక్షరమే నా ఆరోప్రాణమై 
 అక్షరమే నా ఆయుధమై అక్షరమే నాకు సర్వస్వ మౌతుంది
 
 అక్షరాలను అందంగా దిద్దుతూ నేర్చుకున్నట్లే
 జీవితాన్ని తీర్చిదిద్దుకోవడం మన చేతుల్లోనే వుంది
 అక్షరాల తోటలోని సౌరభం మనసును కట్టిపడేస్తూ...
 విశ్వాన్ని ఎంతో గొప్పగా మనకు పరిచయం చేస్తుంది
 

అక్షరాలు సకారాత్మకమైతే జీవితం ఇక శాంతిమయమే
 మాటల్లోని ముత్యాలసరాలే గెలుపు బాటలు వేస్తాయి జీవితానికి వరాలవుతాయి
 అహంకారం తలకెక్కిన వేళ ప్రయోగించే పరుషాక్షరాలు 
 యమపాశాలవుతాయి మిత్రుల్ని శత్రువులుచేస్తాయి
 అక్షరాలా త్రికరణశుద్ధిగా స్వచ్ఛమైన మనసుతో పలికినవి మహామంత్రాలవుతాయి
 మహోన్నతమైన వ్యక్తిత్వాన్నిస్తాయి సామాన్యుని సైతంమహిమాన్వితునిగా చేస్తాయి
 శ్రీరామునిమాట మనకు ఆదర్శంగా నిలిచింది
 శ్రీ కృష్ణుని గీత కర్తవ్యాన్ని బోధిస్తుంది వారికి వాగ్భూషణమై నిలిచింది
 
 స.రి.గ.మ.ప.ద.ని ఏడు అక్షరాలు సప్తస్వరాలు ధ్వనితరంగాలై అలరిస్తూ
 భువిని స్వర్గంగా తలపిస్తూ మానసవీణయను సుతారంగా మీటుతాయి
 పరిపరివిధాల సతమతమౌమదిని మరిపించి,మురిపించి ఆనంద డోలికలలో ఓలలాడిస్తూ
 మోహనరవళి రవాలై అణువణువులో నూతన ఉత్తేజాన్ని నింపి ఆనంద తాండవం చేయిస్తాయి
 
 అక్షరాలతో పదాలు, పదాలతో వాక్యాలు సర్వం శబ్దమయం..
 శబ్దంలో సంగీతం నిక్షిప్తమై సంగీత సామ్రాజ్యాన్ని ఏలుతున్నాయి
 రాగం, తానం, పల్లవులతో శ్రుతి, లయలు గమక గీతాలై
 ఆబాల గోపాలానికి ఆనందాన్నిస్తూ మైమరపించే పారవశ్యంలో 
 ముంచెత్తుతూ అమృతఘడియల్లో నర్తిస్తాయి
 నీటిగలగల జలతరంగమై, రాతిస్థంభాల చేతనత్వమై సుమనోహర సరిగమలు పలుకుతాయి
 మధుర సంగీత శాస్త్రాన్ని, సామవేదాన్ని, వేలకీర్తనలను సృజించాయి
 అక్షరాల్లోని అనంతమైన భావాలను, రాగాలను పలికించే 
 సంగీతానికి శ్వాసే ఆధారమయితే 
 భాష నిర్మాణానికి అక్షరాలే మూలాధారాలు
 
 నాడు కవులకు అక్షర లక్షలతో రాజుల పోషణ నేడు 
 అక్షరజ్ఞానమే రాజాలా లక్షల సంపాదననిస్తున్నాయి
 సుమధురమౌ అక్షరాలే శ్రావ్యసంగీతమై మనసుకు శాంతి, 
 సౌఖ్యమిచ్చు దివ్యౌషధాలవుతాయి
 అద్వైత సిద్ధికి, అమరత్వ లబ్ధికి అక్షరాలా రాగాలే సోపానమౌతాయి
 ప్రకృతిలో ఆణువణువులో అనంతమైన శూన్యంలో 
 అండపిండ బ్రహ్మాండాలలో ధ్వనించేది ఆ పవిత్రనాదమే
 
 అతీంద్రియ అక్షర శబ్దం సృష్టికి మూలమైన శక్తి రూపం, వేదసారం అక్షర పరబ్రహ్మంగా పురుషోత్తమంగా ప్రణవనాదంగా పిలవబడే 
 ఓంకారం శుద్ధ శబ్దమంత్రం.మానవ రుధిరంలో, హృదయంలో, 
 నాడీ మండలంలో, షట్చక్రాలలో ప్రతిధ్వనించు ఓంకారనాదం 
 ఏకాగ్రాతలో, ధ్యానంలో మాత్రమే అనుభవమౌతుంది
 

మది, మదిలో ప్రతిధ్వనించు క్షరం కాని అక్షరం, అక్షయం 
 అమరం కావాలని ఆకాంక్ష
 ఆచంద్రతారార్కం అక్షరం నిలవాలని ఆశిస్తూ అక్షర మేధో మధనంలో 
 ఉద్భవించు అమృతధారలు అందుకోవాలి
 
 విచక్షణతో చేయు అక్షరప్రయోగం విజయాన్ని పాదాక్రాంతం చేస్తుంది
 అజ్ఞానాంధకారంనుండి వెలుగు వైపు నడిపించేది సంపూర్ణ జ్ఞానం
 సంకల్పాలు అసంకల్పితంగా ఆచరణలో పెట్టగలిగితేనే సఫలీకృత మౌతాయని
 అక్షరాలా నా హృదిలోని ప్రగాఢ విశ్వాసం
 
 అక్షరానికో దేవత ఆవాహన చేయలేకున్నాఅక్షర ఆలయాలు నిర్మించలేకున్నా
 సాహితీ సంద్రపు తీరంలో నిత్యం ఉప్పొంగే కెరటాలతో గంభీరముద్ర దాల్చు సాగరతీరంలో
 అక్షర సైకతశిల్పిని కావాలి. అదే నా జీవితేచ్ఛ!


Leave a comment